Translate English to Arabic Google-Translate-Chinese (Simplified) BETA Translate English to Arabic Translate English to Arabic Translate English to Croatian Translate English to Czech Translate English to danish Translate English to Dutch Translate English to Finnish Translate English to French Translate English to German Translate English to Greek Translate English to Hindi  Translate English to Italian Google-Translate-English to Japanese BETA Translate English to Korean BETA Translate English to Norwegian Translate English to Polish Translate English to Portuguese Translate English to Romanian Translate English to Russian Translate English to Russian BETA Translate English to Spanish

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు Andhra state Foundation

నేపథ్యం

బ్రిటిషు పరిపాలనా కాలంలో ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ వివిధ ప్రాంతాల ఏలుబడిలో ఉండేది. తెలంగాణా ప్రాంతం ఇప్పటి కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలతో కలిసి నిజాము పాలనలో ఉండేది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగంగా, బ్రిటిషు వారి అధికారంలో ఉండేది.


మద్రాసు ప్రెసిడెన్సీలో కింది జిల్లాలు ఉండేవి.

శ్రీకాకుళం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు.


మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభాలోను, విస్తీర్ణంలోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్ప్పటికీ, పరిపాలనలోను, ఆర్ధిక వ్యవస్థ లోను తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, ఆంధ్రులలో అభద్రతా భావం కలిగింది. తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్ధికంగాను గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు. తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం – విశాలాంధ్ర - కావాలనే కోరిక తలెత్తి క్రమంగా బలపడసాగింది.


అంకురార్పణ

మొట్టమొదటి సారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన అధికారికంగా 1912 మే లో నిడదవోలు లో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో వచ్చింది. అయితే ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించకుండానే సభ ముగిసింది. ఆన్ని తెలుగు జిల్లాల ప్రతినిధులతో ఏర్పాటైన సమావేశంలో మాత్రమే తీర్మానం చెయ్యాలని నిర్ణయించి తీర్మానాన్ని వాయిద వేసారు.


నిడదవోలు సభలో నిర్ణయించిన ప్రకారం 1913 మే 20న గుంటూరు జిల్లా బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు. ప్రత్యేకాంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. అయితే రాయలసీమ, గంజాము, విశాఖపట్నం లకు చెందిన ప్రతినిధులు ప్రత్యేకాంధ్ర ప్రతిపాదనకు అంత సుముఖత చూపలేదు. తరువాతి రోజుల్లో పట్టాభి సీతారామయ్య ఈ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాడు. ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టారు.


ఆ తరువాత జరిగిన సభల్లో కూడా ప్రత్యేక రాష్ట్రం గురించిన చర్చలు జరిగాయి. రెండవ ఆంధ్ర మహాసభ 1914లో విజయవాడ లో జరిగింది. ఆ సభలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో ఒక తీర్మానం చేసారు. కాకినాడలో జరిగిన నాలుగవ ఆంధ్ర మహాసభలో భోగరాజు పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య కలిసి భారత రాష్ట్రాల పునర్ణిర్మాణం పేరిట ఒక కరపత్రాన్ని తయారుచేసారు. దీన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెసు వాదులకు పంచిపెట్టారు.


కాంగ్రెసుకు చేరిన ఉద్యమం

1914లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు సమావేశంలో మొదటి సారిగా ప్రత్యేకాంధ్ర ప్రస్తావన వచ్చింది. ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక కాంగ్రెసు విభాగం ఉంటే, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని భావించి, దాని గురించి తమ వాదనను వినిపించి, దానిపై అభిప్రాయాన్ని కూడగట్టగలిగారు. ఈ సభతో ప్రత్యేకాంధ్ర ఉద్యమం ఆంధ్ర మహాసభ నుండి, కాంగ్రెసు పార్టీ సభలోకి చేరింది. అయితే ఈ ప్రతిపాదన కాంగ్రెసు పరిశీలనకు వచ్చినా, దానిపై నిర్ణయం తీసుకోడానికి మరో నాలుగేళ్ళు పట్టింది. కాంగ్రెసు పెద్దల వ్యతిరేకతను అధిగమించి, 1918 జనవరి 22 న ఆంధ్రకు ప్రత్యేకంగా కాంగ్రెసు విభాగాన్ని ఏర్పాటు చేయించడంలో ఆంధ్ర నాయకులు కృతకృత్యులయ్యారు.


చట్ట సభల్లో చర్చ

1918లో ప్రత్యేకాంధ్రోద్యమం మరో మెట్టెక్కింది. ఫిబ్రవరి 6 న మద్రాసు శాసనసభలో భాష ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్ర స్థాపన గురించి బి ఎన్‌ శర్మ ఒక ప్రతిపాదన ప్రవేశపెట్టాడు. ఆ ప్రతిపాదన ఇది:


The redistribution of provincial areas on a language basis wherever... and to the extent possible, especially where the people speaking a distinct language and sufficiently large in number desire such a change


విభజించు, పాలించు అనే బ్రిటిషు వారికి భాష ప్రాతిపదికపై ప్రజలు ఏకమవడం సహజంగానే రుచించక, ఆ ప్రతిపాదన వీగిపోయింది.

ఆంధ్రుల్లో అనైక్యత

అయితే, ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి అన్ని ప్రాంతాల వాళ్ళూ కలిసి రాలేదు. అభ్వృద్ధి విషయంలో కోస్తా జిల్లాల కంటే వెనకబడి ఉన్న రాయలసీమ ప్రాంతం ప్రత్యేకాంధ్ర మరింత వెనకబడి పోతుందనే ఉద్దేశ్యంతో, తమకూ ప్రత్యేక కాంగ్రెసు విభాగం కావాలనే ప్రతిపాదనను 1924 లో రాయలసీమ నాయకులు లేవదీసారు.


ఈ అపోహలకు, అనుమానాలకు తెరదించుతూ 1937 లో చారిత్రాత్మకమైన శ్రీబాగ్‌ ఒడంబడిక కుదిరింది. కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య మద్రాసులో కుదిరిన ఈ ఒప్పందంతో రాయలసీమ నాయకులు సంతృప్తి చెందారు. ప్రత్యేకంధ్ర ఏర్పడితే, రాయలసీమకు ఎటువంటి ప్రత్యేకతలు ఉండాలనేదే ఈ ఒడంబడికలోని ముఖ్యాంశాలు.


1939 లో కృష్ణా జిల్లా కొండపల్లిలో జరిగిన సభలో ప్రత్యేకాంధ్ర కోరుతున్న అన్ని సంస్థలూ విలీనమై ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సంఘం గా ఏర్పడ్డాయి. 1939 అక్టోబర్‌ కల్లా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యేలా ప్రయత్నించాలని ఆంధ్ర శాసనసభ్యులను కోరింది.

స్వాతంత్ర్యం తరువాత

1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చినపుడు, తమ చిరకాల వాంఛ తీరుతుందని ఆశించారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు, ఉప ప్రధాని వల్లభ్‌భాయి పటేల్‌కు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోయింది.

భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం ఎస్‌.కె.దార్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన భాషాప్రయుక్త రాష్ట్రాల కమిషను ఏర్పాటు చేసింది. ఆంధ్ర మహాసభ తమ విజ్ఞప్తిని కమిషనుకు అందజేసింది. ఇక్కడ ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య గల విభేదాలు మళ్ళీ బహిర్గతమయ్యాయి. నీలం సంజీవరెడ్డి నాయకత్వం లోని రాయలసీమ నాయకులు సమర్పించిన విజ్ఞాపనలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వెయ్యాలని కోరుతూ, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలని కోరింది. ఆంధ్రులలోని అనైక్యతను గమనించిన కమిషను భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించింది. ఈ కమిషను నివేదికతో ఆందోళన చెందిన ఆంధ్రులను బుజ్జగించడానికి కాంగ్రెసు పార్టీ నాయకులు, నెహ్రూ, పటేల్‌, భోగరాజు పట్టాభి సీతారమయ్య లతో ఒక అనధికార సంఘాన్ని ఏర్పాటు చేసింది. జె.వి.పి కమిటీగా పేరొందిన ఈ సంఘం 1949 ఏప్రిల్‌లో కాంగ్రెసు వర్కింగు కమిటీకి కింది సూచనలు చేసింది.


  • భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొన్నేళ్ళు వాయిదా వెయ్యాలి.
  • కాని ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం ఏర్పాటు చయ్యాలి – అయితే ఒక నిబంధన మీద..
  • నిబంధన: మద్రాసును ఆంధ్రులు వదులుకోవాలి

మద్రాసును వదులుకొనేందుకు ఇష్టపడని ఆంధ్రుల్లో ఈ నివేదిక అలజడి సృష్టించింది. ఈ పరిస్థితుల మధ్య అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి, కుమారస్వామి రాజా నాయకత్వంలో ఒక విభజన సంఘం ఏర్పాటయింది. ఆంధ్రుల తరపున టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, కళా వెంకటరావు, నీలం సంజీవరెడ్డి ఈ సంఘంలో సభ్యులు. ఈ సంఘం ఒక నిర్దుష్ట ఒప్పందానికి రాలేకపోయింది. ప్రకాశం మిగిలిన సభ్యులతో విభేదించి, అసమ్మతి లేవనెత్తాడు. ఆయన అసమ్మతిని అవకాశంగా తీసుకొని కేంద్రప్రభుత్వం మొత్తం వ్యవహారాన్నే అటకెక్కించింది.


దీనితో అసంతృప్తి చెందిన ప్రముఖ గాంధేయవాది, స్వామి సీతారాం (గొల్లపూడి సీతారామశాస్త్రి) ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నాడు. దీంతో ఉద్రిక్త భరిత వాతావరణం ఏర్పడింది. 35 రోజుల తరువాత, 1951 సెప్టెంబర్ 20న ఆచార్య వినోబా భావే అభ్యర్ధనపై ఆయన తన దీక్షను విరమించాడు. ఈ దీక్ష, ప్రజల్లో తమ నాయకుల పట్ల, కేంద్రప్రభుత్వం పట్ల అపనమ్మకం పెంచడం మినహా మరేమీ సాధించలేక పోయింది.

కృష్ణా-పెన్నా ప్రాజెక్టు వివాదం

1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో, కాంగ్రెసును ఓదించి, ఆంధ్రులు వారిపై గల తమ అసంతృప్తి వెలిబుచ్చారు. మద్రాసు శాసనసభ లో ఆంధ్ర ప్రాంతం నుండి ఉన్న 140 స్థానాలలో కాంగ్రెసు 43 మాత్రమే పొందగా, కమ్యూనిస్టులు పోటీ చేసిన 60 స్థాల్లోను 40 ని గెలుచుకున్నారు. మొత్తం శాసనసభలో కాంగ్రెసు బలం 152 కాగా, కాంగ్రెసేతర సభ్యులు 164 మంది. వీరంతా ఐక్య ప్రజాస్వామ్య ఫ్రంటు గా ఏర్పడి టంగుటూరి ప్రకాశాన్ని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. అయితే అప్పటి గవర్నరు, రాజాజీ ని శాసన మండలికి నామినేట్‌ చేసి, మంత్రివర్గ ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించాడు.


రాజాజీ ముఖ్యమంత్రి అయ్యాక, కృష్ణా-పెన్నా ప్రాజెక్టు కట్టి, కృష్ణా నీళ్ళను తమిళ ప్రాంతాలకు మళ్ళించే ఆలోచన చేసాడు. ఆ ప్రాజెక్టు కడితే తమ నోట మన్నే అని గ్రహించిన ఆంధ్రులు ఆందోళన చేసారు. సమస్య పరిశీలనకై కేంద్రప్రభుత్వం ఎ.ఎన్‌ ఖోస్లా నాయకత్వంలో ఒక నిపుణుల సంఘాన్ని నియమించింది. ప్రాజెక్టును ప్రతిపాదిత స్థలంలో కట్టకూడదనీ, నందికొండ (ఇప్పటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్న ప్రదేశం) వద్ద కట్టాలనీ ఈ కమిటీ సూచించింది. రాజాజీ ప్రభుత్వం తమపై సవతి ప్రేమ చూపిస్తున్నదనే ఆంధ్రుల భావన మరింత బలపడింది. మద్రాసు రాష్ట్రం నుండి వేరు పడాలనే ఆంధ్రుల భావన మరింత బలపడసాగింది.


పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం

ఈ సమయంలో 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు అనే గాంధేయవాది, మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేకాంధ్ర సాధనకై మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు."మద్రాసులేని ఆంధ్ర తలలేని మొండెం" అన్నాడు. ఈ దీక్ష ఆంధ్ర అంతటా కలకలం రేపినా, కాంగ్రెసు నాయకులు, కేంద్రప్రభుత్వంలో మాత్రం చలనం రాలేదు. 1952 డిసెంబర్ 15న 56 రోజుల అకుంఠిత దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యాడు. ఆయన మృతి ఆంధ్రుల్లో క్రోధాగ్ని రగిలించి, హింసాత్మక ఆందోళనకు దారితీసింది. ప్రజల్లో అనూహ్యంగా వచ్చిన ఈ స్పందనను గమనించిన నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా లోక్‌సభలో 1952 డిసెంబర్ 15న ప్రకటించాడు. 11 జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని 3 తాలూకాలు ఇందులో భాగంగా ఉంటాయి.


శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలుకాలు కలిపి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకా ఎల్‌.ఎస్‌ మిశ్రా సంఘం నివేదిక ననుసరించి మైసూరు రాష్ట్రంలో కలిపేసారు.


1937 నాటి శ్రిబాగ్‌ ఒడంబడిక ననుసరించి కొత్త రాష్ట్రానికి కర్నూలు ముఖ్యపట్టణం అయింది. టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యాడు. సి.ఎం.త్రివేది గవర్నరు అయ్యాడు. నెహ్రూ చేతుల మీదుగా జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రుల చిరకాల స్వప్నం కొంత ఫలించింది. ఇక తెలుగు మాట్లాడే మిగత ప్రాంతాలైన నైజాముతో కలిపి విశాలాంధ్ర ఏర్పడటమే తరువాయి.