రోడ్లమీద వాహనాలు నడవడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో ఏకంగా ఆస్ట్రేలియాలో రోడ్డురైళ్లు వచ్చేశాయి. అయితే
ఇవి ఇప్పుడు కొత్తగా రాకున్నా గతంలో కన్నా మెరుగైన రవాణా వ్యవస్థను కలిగి ఎన్నో వందల టన్నుల బరువులను మోసుకెళుతూ దట్టమైన అడవులు, ఎడారులు, పీఠభూములు, కొండవాలు ప్రాంతాలలో కూడా చొచ్చుకుపోవడం వీటి విశిష్టత. వెనకటి కాలంలో కేవలం మిలటరీ సరుకు చేరవేసేందుకు మాత్రమే పొడవాటి ట్రక్కులను ఉపయోగించేవారు. ఇటువంటి ట్రక్కులను లాంగన్ కాంబినేషన్ వెహికల్స్ (ఎల్‌సీవీ) అంటారు. ప్రస్తుతం అభివృద్ధిచెందిన దేశాలైన అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రిటన్, మెక్సికో, అమెరికా, పశ్చిమ కెనడా దేశాలలో ఎక్కువ మొత్తంలో సరుకులు చేరవేసేందుకు ఈ రోడ్డు రైలు వాహనాలు ఉపయోగపడుతున్నాయి.
చూడటానికి అచ్చం రైలులా కనిపించే ఈ వాహనం వెనక దాదాపు 100కు పైగా రైలు బోగీలు ఉన్నట్లు క్యారేజీలు ఉంటాయి. మామూలు ఇంజన్ల కన్నా శక్తివంతమైన ఇంజన్లు ఉపయోగించి ఈ వాహనాలను నడుపుతారు. ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకులు చేరవేయడంతో దీనికి సాటి మరే వాహనం సరికాదని అక్కడి రవాణా అధికారులు చెబుతున్నారు. అయితే అధిక జనాభా ఉన్న మన భారత దేశంలో ఇరుకైన రోడ్ల మీద ఇటువంటి వాహనాలు తిరగలేవు. ట్రాఫిక్ సమస్యలు పెద్దగా లేనటువంటి విశాల ప్రాంతాలలో మాత్రమే ఈ వాహనాలు తిరుగుతాయి. వీటిని మంచులో కూడా కూరుకుపోకుండా వెళ్లేందుకు వీలుగా ఉపయోగించుకుంటున్నారు.
సాధారణంగా భూగర్భ గనులు, కలప, వినియోగవస్తువులను చేరవేసేందుకు మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నారు. వీటివలన డబ్బు, సమయం రెండూ కూడా ఆదా అవుతున్నాయట. ఈ వాహనాలు అతి పెద్ద, పొడవైనవిగా గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం. 2004లో తయారుచేసిన ఒక రోడ్డురైలు వాహనానికి దాదాపు 100 క్యారేజీలు అమర్చగా 2006 సంవత్సరంలో 112 క్యారేజీలను తగిలించి సరికొత్త రికార్డును ఆస్ట్రేలియాలో నెలకొల్పారు. దీని పొడవు 1,474.3 మీటర్ల పొడవు ఉంటుంది. నిజంగా ఇటువంటి వాహనం రోడ్డు మీద వెళుతుంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. పట్టాలు తప్పిన రైలు ఏకంగా రోడ్డుమీదకు వస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది.
Loading