భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించినారు. అనగా తెలుగు హిందీ, సంస్కృతము, లాటిను, గ్రీకు మొదలగు భాషలు చెందు ఇండో ఆర్య భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు ) చెందకుండా, తమిళము, కన్నడము, మళయాళము, తోడ, తుళు, బ్రహుయి మొదలగు భాషలతోపాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందును.
తూర్పున కూరఖ్, మాల్తో భాషలు, వాయవ్యాన పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో మాట్లాడే బ్రహూయి భాషా, దక్షిణాన ఉన్న తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. సింధులోయ నాగరికతలోని భాష గురించి ఖచ్చితంగా ఋజువులు లేకపోయినప్పటికీ, అది ద్రావిడ భాషే అవటానికి అవకాశాలు ఎక్కువని కూడా వీరి అభిప్రాయం.
తెలుగు ఇతర భాషా పదాలను సులభంగా అంగీకరిస్తుంది. సంస్కృతము ప్రభావము తెలుగు సాహిత్యముపై చాలా ఎక్కువ. సంస్కృతము చూపించినంత ప్రభావము ఇంక ఏ భాష కూడా తెలుగు భాషపై చూపలేదు. నిజానికి తెలుగు లిపిలో చాలా అక్షరములు, ముఖ్యముగా మహాప్రాణ (aspirated) హల్లులు కేవలం సంస్కృతము కోసమే లిపిలోనికి తీసుకొనబడినాయి. "మంచి సంస్కృత ఉచ్చారణ కోస్తా ప్రాంతములోని పండితుల దగ్గర వినవచ్చు" అని చెప్పడం అతిశయోక్తి కాదు. అంతేకాకుండా ఇక్కడి పండితులను పొరుగు రాష్ట్రాల వారు వైదిక కర్మలను జరపడానికి ప్రత్యేకంగా పిలుచుకొని వెళ్ళేవారు అని ప్రతీతి. తెలుగుకి, సంస్కృతమునకు చాలా దగ్గర సంబంధం ఉండడం వలన వారి ఉఛ్ఛారణ స్వఛ్ఛంగా ఉంటుందనటంలో అతిశయోక్తి ఏమీలేదు. ఇప్పటికీ తెలుగు భాషలో సంస్కృత పదములను మనం గమనించవఛ్ఛు. సంస్కృత భాషా ప్రభావం భారత దేశ భాషలన్నింటి మీద ఉంది. కానీ తెలుగు భాషని గమనిస్తే, తెలుగుకి సంస్కృతం మాతృమూర్తి అనిపిస్తుంది. ఎందుకనగా ఉఛ్ఛారణ, భావం సంస్కృతం ను తలపిస్తాయి.
సంస్కృతము తెలుగు సాహితీ ప్రపంచంలో ఓ శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నట్లే, పర్షియను, ఉర్దూ పదాలు కూడా తెలుగు కార్యనిర్వాహక పదబంధములలో ఓ స్థానం ఏర్పరుచుకున్నవి. బ్రిటీషు వారి పరిపాలనవల్ల, మరియు సాంకేతిక విప్లవం వల్ల ఈ రోజుల్లో ఏ ఇద్దరు తెలుగువాళ్ళు కూడా ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఆంగ్ల పదాలు లేకుండా తెలుగులో మాట్లాడుకోలేరు అని చెప్పడం సత్యదూరం కాదు. భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రముఖ జన్యు (Genetic) శాస్త్రవేత్త అయిన జె.బి.ఎస్.హాల్డేన్ గారు ఓ సందర్భములో తెలుగు భారత దేశానికి జాతీయ భాష కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పడములో ఆశ్చర్యము లేదు.
తెలుగువారికి ఆంగ్లము అంటే ఇంత ప్రేమ ఉన్నప్పటికీ భాషాశాస్త్రపరంగా, సంస్కృతీపరంగా, వ్యాకరణ పరంగానూ ఈ రెండు భాషలూ చాలా దూరంలో ఉంటాయి. తెలుగులో వాక్యం లో కర్త-కర్మ-క్రియ అవే వరుసలో వస్తాయి, కానీ ఇంగ్లీషు నందు మాత్రము కర్త-క్రియ-కర్మ గా వస్తాయి. ఆంగ్లము మాట్లాడువారికి తెలుగులో పదాల వరుస వ్యతిరేకదిశలో ఉంటాయి. ఇంకా చాలా తేడాలు ఉన్నాయి, ముఖ్యముగా past perfect Tense విషయములో.
భావ వ్యక్తీకరణలో తెలుగు ప్రపంచ భాషలన్నింటితోనూ పోటీ పడుతుంది. ప్రపంచంలోని అతి కొద్ది క్రమబద్ధీకరించబడిన భాషలలో ఇది ఒకటి. తెలుగు వ్యాకరణము చాలా తేలికగానూ, నిర్మాణపరంగా అతిశుద్ధంగానూ ఉంటుంది. అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. ముఖ్యముగా కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి. త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తన లతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు. పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన యూరోపియనులు తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" (Italian of the east) అని పిలుచుకున్నారు.
తెలుగు (మరియూ ఇతర భారతదేశ బాషలలోని) ఒక ప్రముఖమైన విషయము ఏమిటంటే సంధి. రెండు పదాలు పక్కపక్కన చేర్చి పలికినప్పుడు మనకు క్రొత్త మూడవ పదము వస్తుంది.
అనేక ఇతర ద్రావిడ భాషల వలె కాక తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, మొదటి శకం బి.సి లో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాలనాటిది[1].
ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకం ఎ.డి. కి చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.
ఆంధ్రులగురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదాహరింపబడినది: (డా.జి.వి.సుబ్రహ్మణ్యం కూర్చిన "తెలుగుతల్లి" కవితా సంకలనంలో ఇవ్వబడినది)
-
- పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
- అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి
అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమిచే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు.