ఈ మూడు పదాల మూలాలూ, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము)లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. క్రీ.పూ. 4వ శతాబ్ధిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించినాడు.
ఆంధ్రులు మాటాడే భాషకు ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. ఆంధ్ర, తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులనీ అవి క్రమంగా మిళితమైనాయన్న కొంతమంది అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకవు. వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగు గోదావరి, కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం. 10 వ శతాబ్దపు చరిత్రకారుదు అల్ బిరుని తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను [2].
క్రీ.శ. 1000 కు ముందు శాసనాలలోగాని, వాఙ్మయంలో గాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభమునుండి 'తెలుంగు భూపాలురు', 'తెల్గరమారి', 'తెలింగకులకాల', 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి.
11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలమునాటికి తెలుగు రూపాంతరముగా "తెనుగు" అనే పదము వచ్చినది. 13వ శతాబ్దములో మహమ్మదీయ చారిత్రికులు ఈ దేశమును "తిలింగ్" అని వ్యవహరించారు.
15వ శతాబ్దము పూర్వభాగంలో విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకారచూడామణిలో ఇలా చెప్పాడు.
-
- ధర శ్రీ పర్వత కాళే
- శ్వర దాక్షారామ సంజ్ఙ వఱలు త్రిలింగా
- కరమగుట నంధ్రదేశం
- బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్
-
- తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁ
- దెలుఁగు దేశ మనఁగఁ దేటపడియె
- వెనకఁ దెనుఁగు దేశమును నండ్రు కొందరు
శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం - అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమనీ, "త్రిలింగ" పదము "తెలుగు" గా పరిణామము పొందినదనీ ఒక సమర్థన. ఇది గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేననీ, తెలుగు అనేదే ప్రాచీన రూపమనీ చరిత్రకారుల అభిప్రాయము. 12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" - అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము - అని వర్ణించాడు.
మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర - అనే పదాలు భాషకూ, జాతికీ పర్యాయ పదాలుగా రూపు దిద్దుకొన్నాయి.
తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు.
అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన భట్టిప్రోలు లిపి నుంచి తెలుగు లిపి ఉద్భవించింది[3].
ఈ లిపిని బౌద్ధులు, వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, మరియు బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపి తో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలనే కనిపిస్తుంది.
తెలుగు లిపిలో చాలవరకు ఉచ్చరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్ఛరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు "అచ్చులు" ( వొవెల్స్ లేదా స్వర్ ) మరియు "హల్లులు" ( కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్ ) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారము మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికీ , చదవడానికీ, అచ్చు "అ" ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చుఅంశం వర్ణ పరిచ్ఛేదముతో "మాత్రలు" అన్నసంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ "మాత్రల" ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం "పూర్ణవిరామం"తో కానీ, "దీర్ఘవిరామం"తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, అరాబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి.
ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు కలవు.
తెలుగును సాధారణంగా ఒకదానితో ఒకటి కలిసి చేరి పోయే భాషగా గుర్తిస్తారు, ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.
తెలుగు అక్షరమాలకు మూలం ఒక కధ ప్రచారంలలో ఉంది.ఒక ఋషి తన కలలో పరమేశ్వరుడు కనిపించి అతని వద్ద గల డమరుకం మ్రోగించగా ఆ డమరుకం నుంచి తెలుగు అక్షర మాల వినిపించిందని,దానిని అక్షర రూపం కల్పించారని ప్రతీతి.