ఆంధ్రులు వింధ్యపర్వత దక్షిణ భాగానికి తరలి వెళ్ళి, ద్రావిడులతో కలసిన ఆర్యులుగా క్రీ.పూ. 7వ శతాబ్దపు సంస్కృత రచనలు వర్ణిస్తున్నాయి. క్రీ. పూ. 5వ శతాబ్దములో ప్రతీపాలపురం (భట్టిప్రోలు) రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేస్తున్నాడని ఆధారాలు దొరికాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకము (అమరావతి) సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని మరణానంతరం (క్రీ.పూ 232) ఆంధ్రులు వెలుగులోకి వచ్చారు. నవీన చరిత్రకారులు ఆంధ్రుల చరిత్ర ఆనాటినుండి మొదలైనట్లుగా లెక్కిస్తున్నారు. ఆంధ్ర (శాతవాహన), శక, పల్లవ, ఇక్ష్వాకు, తెలుగు చోళ, తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహి, హైదరాబాదు నిజాం లు మొదలైన వంశాలకు చెందిన రాజులు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు. క్రీ.శ 17వ శతాబ్దములో బ్రిటీషు వారు కోస్తా ఆంధ్రను నిజామ్ వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రములో (మద్రాసు ప్రెసిడెన్సీ) కలుపుకున్నారు. హైదరాబాదు నిజామ్ బ్రిటిషు ఆధిక్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనాడు.
భారత దేశ స్వాతంత్ర్యానంతరము
1947లో భారత దేశానికి ఆంగ్లేయుల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నిజాము, హైదరాబాదు సంస్థానాన్ని తమ పాలనలోనే ఉంచుకోవటానికి ప్రయత్నించాడు. పోలీసు చర్య ద్వారా హైదరాబాదు 1948 భారత దేశంలో విలీనమై, హైదరాబాదు రాష్ట్రంగా అవతరించింది.
మద్రాసు రాజధానిగా ఉండే ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి' పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించారు, కానీ కర్నూలును రాజధానిగా చేసి 1953 అక్టోబరు 1న మద్రాసు రాష్ట్రంలో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.
ఆంధ్ర ప్రజల కోరికపై 1956, నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. ఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రములలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి రాష్ట్రము అయినది. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.
1960 వ సంవత్సరంలో పటాస్కర్ కమీషన్ తీర్పుమూలంగా చిత్తూరు జిల్లా తిరుత్తణి తాలూకాలోని ఎక్కువ భాగాన్ని తమిళనాడు కు ఇచ్చి, తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ లో చేర్చారు. ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి. తరువాత, 1970, ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా, 1978 ఆగష్టు 12న రంగారెడ్డి జిల్లా, 1979 జూన్ 1న విజయనగరం జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాలయ్యాయి.