నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి. 1982 వరకు అన్నీ కాంగ్రెసు ప్రభుత్వాలే ఆంధ్ర ప్రదేశ్ ను పరిపాలించాయి. 1982 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలము పనిచేశాడు. ఆయన తరువాత పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేసాడు. తరువాతి కాలంలో ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసాడు.
అయితే 1982 వరకు రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెసుకు ఉన్న బలాన్ని సవాలు చేయటానికి నందమూరి తారక రామారావు అదే సంవత్సరములో తెలుగుదేశం అనే పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. స్థాపించిన తొమ్మిది నెలలలోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టడంతో ఒక బుడతడి దెబ్బకు వస్తాదు కుప్పకూలినట్లయింది.
2004 అసెంబ్లీ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పోటీ చేసింది. కాంగ్రెసు, తెరాస కూటమి పదవిలోకి రావడంతో, కాంగ్రెసుకు చెందిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు.