ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలోని ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలో నాలుగవ అతి పెద్ద రాష్ట్రమై ఉత్తర, దక్షిణాలకు వారధిలా ఉన్నది. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ.
ఆంధ్రప్రదేశ్ 12o37', 19o54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76o46', 84o46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82o30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ గుండా పోతుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో మూడు ముఖ్య ప్రాంతములు కలవు: కోస్తా ఆంధ్ర, తెలంగాణ మరియు రాయలసీమ. రాష్ట్రములో 23 జిల్లాలు కలవు. హైదరాబాదు, రాష్ట్ర రాజధాని మరియు అతి పెద్ద నగరము. ఇతర ముఖ్య నగరాలు విజయవాడ, విశాఖపట్నం,తిరుపతి,కర్నూలు, కడప, వరంగల్లు, గుంటూరు. గోదావరి, కృష్ణ వంటి మహానదులు రాష్టంలో ప్రవహిస్తూ కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయుటకు తోడ్పడుతున్నాయి.
శాసన వ్యవస్థ
ఆంధ్ర ప్రదేశ్ విధాన మండలి (ఎగువ సభ)లో 90 స్థానాలు, శాసనసభ (దిగువసభ) లో 294 స్థానాలు ఉన్నాయి.దీనికి తోడు, ఆంగ్లో-ఇండియన్ వర్గం నుంచి ఒకరిని శాసన సభకు నామినేటు చేస్తారు.ఆ రకంగా శాసన సభ లో సభ్యుల సంఖ్య 295. ఆంధ్ర ప్రదేశ్ కు పార్లమెంటులో 60 స్థానాలు కలవు - రాజ్యసభలో 18 మరియు లోక్‌సభ లో 42.
జిల్లాలు
ఆంధ్ర ప్రదేశ్ లో 23 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు చూడండి.
ఆర్ధిక రంగము
రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు వ్యవసాయం ఆయువుపట్టు. భారత దేశములోని రెండు ప్రధాన నదులు, గోదావరి మరియు కృష్ణ రాష్ట్రం గుండా ప్రవహిస్తాయి. వరి, పొగాకు, ప్రత్తి, మిర్చి, మరియు చెరుకు రాష్ట్రంలో పండించే ముఖ్యమైన పంటలు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు బయోటెక్నాలజీ రంగాల్లో కొత్తపుంతలు తొక్కుతున్నది.
హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని. దేశంలోనే ఐదవ పెద్ద నగరము. మేలైన సంస్కృతీ సాంప్రదాయాలు, ధీటైన చరిత్ర, పారిశ్రామికాభివృద్ధి, మరియు సాంకేతిక పరిజ్ఞానం సహజీవనం సాగించే విభిన్నమైన అతి కొద్ది నగరములలో హైదరాబాదు ఒకటి. గతిశీల నాయకత్వంతో రాష్ట్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మసూటికల్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, నిర్మాణము తదితర రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, అపారమైన వ్యాపార అవకాశాలకు నెలవై ఉన్నది.
సంస్కృతి
తెలుగు రాష్ట్ర అధికార భాష. ఉర్దూ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా హైదరాబాదులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు గొప్ప సాంస్కృతిక వారసత్వము కలదు. అన్నమాచార్య, త్యాగరాజు తదితర గొప్ప కర్ణాటక సంగీతకారులు తెలుగు భాషలో కృతులు రచించి, భాషను సుసంపన్నం చేశారు.
కవిత్రయమని పేరుగన్న నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ మహా భారత కావ్యాన్ని తెలుగులోకి అనువదించారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ, డా.సి.నారాయణరెడ్డి మొదలైనవారు తెలుగులో ఆధునిక రచయితలు.
కూచిపూడి రాష్ట్ర శాస్త్రీయ నృత్యం. అలాగే నటరాజ రామకృష్ణ గారి కృషి వల్ల ఆంధ్రనాట్యం కూడా ప్రజాదరణ పొందింది.
ఆంధ్రులు గత 40 సంవత్సరాలుగా సినిమాను విపరీతముగా పెంచి పోషించారు. రాష్ట్రంలో సంవత్సరానికి సుమారు 70 సినిమాలు రూపొందుతాయి. ఆదాయపరంగా తెలుగు సినిమా ఒక పెద్ద పరిశ్రమ, కానీ తక్కిన భారత దేశములో పెద్దగా గుర్తింపు పొందలేదు. రాష్ట్రం నుండి ఉద్భవించిన కొందరు ప్రముఖ సినీ కళాకారులు ఎన్.టి.రామారావు (మాజీ ముఖ్యమంత్రి), అక్కినేని నాగేశ్వరరావు ("ఏ.ఎన్.ఆర్", దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత), ఎస్.వి.రంగారావు, ఘంటసాల, చిరంజీవి , కె.విశ్వనాధ్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సావిత్రి, జమున, శారద, షావుకారు జానకి, జయప్రద మొదలైనవారు.
ఆంధ్ర ప్రదేశ్ లో పలు సంగ్రహాలయాలు (మ్యూజియం) కలవు, అందులో సాలార్ జంగ్ మ్యూజియం, పురావస్తుశాఖ మ్యూజియం ముఖ్యమైనవి. వీనిలో పలు శిల్పాలు, చిత్రాలు, హిందూ మరియు బౌద్ధ మత శిల్పాలు, కళాఖండాల సేకరణలు ప్రదర్శంచబడినవి. ఈ రెండు సంగ్రహాలయాలు హైదరాబాదులో ఉన్నాయి.